భారత్-పాక్ మ్యాచ్ అంటే అదే ఒత్తిడి.. వాచ్‌మన్ మాట గుర్తుచేసిన జెమీమా

  • మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్
  • ఆదివారం నాడు జరగనున్న దాయాదుల సమరం 
  • పాక్‌తో మ్యాచ్ అంటే తీవ్ర ఒత్తిడి ఉంటుందన్న జెమీమా రోడ్రిగ్స్
  • ఎవరితో ఓడినా పాక్‌తో వద్దని వాచ్‌మన్ అన్నాడని వెల్లడి
  • ట్రోఫీ గెలిచినట్టు ఊహించుకుంటూ మానసికంగా సిద్ధమవుతున్నామన్న టీమిండియా
"ఎవరితో మ్యాచ్‌లో అయినా ఓడిపోవచ్చు కానీ పాకిస్థాన్‌తో మాత్రం ఓడిపోవద్దు" అని తన బిల్డింగ్ వాచ్‌మన్ కూడా తనతో అన్నాడని టీమిండియా బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ వెల్లడించింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎంతటి తీవ్రమైన ఒత్తిడి ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఇదొక నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించింది. మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం (జూన్ 14) పాకిస్థాన్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌కు ముందు ఆమె ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌తో ఇరు జట్లూ తమ ప్రపంచకప్ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నాయి. ఈ నేపథ్యంలో జియోస్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెమీమా మాట్లాడుతూ, "భారత్-పాక్ మ్యాచ్‌ల చరిత్ర, అభిమానుల అంచనాల వల్ల బయటి నుంచి ఒత్తిడి ఉంటుందన్నది వాస్తవం. దీన్ని మనం కాదనలేం" అని హర్మన్‌ప్రీత్ కౌర్ డ్రెస్సింగ్ రూమ్‌లో తమతో చెబుతుంటుందని జెమీమా గుర్తుచేసుకుంది.

అయితే, ఈ ఒత్తిడిని అధిగమించి దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి జట్టు పక్కా ప్రణాళికతో సిద్ధమవుతోందని ఆమె వివరించింది. జట్టు సన్నద్ధతలో కోచ్ అమోల్ మజుందార్ కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలిపింది. 2025 వన్డే ప్రపంచకప్‌ను గెలిచిన స్ఫూర్తితో ఆడతామని వ్యాఖ్యానించింది. ప్రతి మ్యాచ్‌కు విభిన్న వ్యూహాలతో సన్నద్ధమవుతామని వెల్లడించింది. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఒత్తిడిని తట్టుకుని ఎలా రాణించాలో ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నామని జెమీమా పేర్కొంది.

Jemimah Rodrigues
India vs Pakistan Women
Womens T20 World Cup 2026
Harmanpreet Kaur
Indian Womens Cricket Team

More Telugu News